ఈ హదీసులో – మంచి చెడుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ముందుగానే నిర్ణయించినాడని, వాటిని ఏవిధంగా గ్రంథస్థం చేయాలనే విషయాన్ని, (ప్రతి వ్యక్తితో పాటు ఎల్లప్పుడూ ఉండే) ఇద్దరు దైవ దూతలకు విశదీకరించినాడని – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే, ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, ఒకవేళ అతడు దానిని చేయలేకపోయినా అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు దానిని చేసినట్లయితే, పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు, ఇంకా ఎక్కువ రెట్లు మంచి పనులు చేసినట్లుగా వ్రాయబడుతుంది. అయితే, పుణ్యఫలం ఎక్కువరెట్లు వ్రాయబడుట మరియు దానికి మించిన ప్రయోజనము అనేది అతడి హృదయంలో ఉన్న సంకల్పము యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది. మరియు ఎవరైతే, ఏదైనా చెడు పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, మరియు అతడు దానిని కేవలం అల్లాహ్ కొరకు చేయకుండా ఆగిపోయినట్లయితే, అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడై ఉండి, అతడు దాని కొరకు అవసరమైన వనరులు సమకూర్చుకొనకుండా ఉండిపోయినట్లయితే, అతడి కొరకు ఏమీ వ్రాయబడదు. ఒకవేళ అతడు అన్నీ సమకూర్చుకుని కూడా ఆ పని చేయలేక ఆగిపోయినట్లయితే, (ఆ విధంగా ఆగిపోవడానికి సంబంధించి) అతని మనసులో ఉన్న సంకల్పము ననుసరించి అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు ఆ చెడు పని చేసినట్లయితే, అతడి కొరకు ఒక చెడుపని చేసినట్లుగా వ్రాయబడుతుంది.