విశ్వాసుల నాయకుడు (అమీరుల్ ము’మినీన్) ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) తన సభలో ఉన్నారు, మరియు ఆయనతో సహచరుల బృందం ఉంది, ఆయన వారితో ఇలా అన్నారు: “అల్ ఫితన్” ను గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రస్తావించగా మీలో ఎవరు విన్నారు?” వారిలో కొందరు “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్-ఫితన్ ను గురించి ప్రస్తావించగా మేము విన్నాము” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితములో అతడు, తన భార్య, పిల్లల పట్ల అధిక ప్రేమ, లేక అతని పిసినారితనం, వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల తాను సత్కార్యాలు చేలేక పోవడం, తన విధులను సరిగా నిర్వర్తించలేక పోవడం, వారి (భార్యా, పిల్లల) హక్కులు నెరవేర్చలేకపోవడం, వారి క్రమశిక్షణ, వారి విద్య మొదలైన విషయాలలో కొరతలు, అలాగే తన పొరుగు వారితో సమస్యలు – బహుషా వీటన్నిటినీ మీరు “అల్-ఫితన్” అనుకుంటున్నారు, అవునా?” దానికి వారు “అవును” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “ఇవి జవాబుదారీ తనానికి సంబంధించిన పరీక్షలు (ఫిత్నాలు), మరియు వాటిలో నమాజు, ఉపవాసం మరియు దానధర్మాలు వంటి మంచి పనుల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడే పాపాలు ఉన్నాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఎదురయ్యే బహిరంగ ఫిత్నాలను (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) గురించి – వాటి తీవ్రత మరియు విస్తృత వ్యాప్తి కారణంగా, అల్లకల్లోలంగా ఉన్న సముద్రపు అలల వలె ప్రజలను కదిలించే ఫిత్నాల గురించి చెప్పగా విన్నారా? ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు హుదైఫహ్ ఇబ్న్ అల్ యమాన్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “నేను విన్నాను”. అది విని ఉమర్ రదియల్లాహు అన్హు సంతోషంగా ఇలా అన్నారు: “నీలాంటి వాడిని పుట్టించినందుకు అల్లాహ్ మీ తండ్రికి ప్రతిఫలం ప్రసాదించుగాక. చెప్పు”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: 'ఒక సిరి చాప యొక్క పుల్లలు, ముద్రలు దానిపై నిద్రిస్తున్న వ్యక్తి వీపుకు, ప్రక్కలకు అంటుకున్నట్లుగా, ఫిత్నాలు (పరీక్షలు) మానవ హృదయానికి మరియు దాని ప్రక్కలకు అంటుకుంటాయి. పరీక్షల తీవ్రత హృదయాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతమవుతాయి. ఈ ఫిత్నాలు ప్రవేశించే ఏ హృదయమైనా వాటిని ఆలింగనం చేసుకుని, ఒక పానీయం శరీరం లోనికి ప్రవేశించిన తరువాత ఎలాగైతే శరీరమంతా దాని ప్రభావం వ్యాపిస్తుందో అలా, ఈ ఫిత్నాలు తనలో వ్యాపించడానికి అనుమతిస్తుంది. అటువంటి హృదయం పై ఒక నల్లని మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిలో (ఫిత్నాలలో) పడకుండా ఫిత్నాలను తిరస్కరిస్తుందో, ఒక తెల్లని మచ్చ దానిపై వేయబడుతుంది. అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. తెల్లని హృదయం - ఇది విశ్వాసం (ఈమాన్) పట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉంటుంది, లోపాల నుండి విముక్తమై ఉంటుంది, అది అల్లాహ్’ను కలుసుకునేంత వరకు దానికి ఏ ఫిత్నాలు (పరీక్షలు, వ్యామోహాలు మొ.) అతుక్కోవు, లేదా దానిని ప్రభావితం చేయవు – ఎలాగైతే ఒక అత్యంత మృదువైన, స్వచ్ఛమైన రాయిపై ఏదైనా పడినా దానికి అతుక్కోకుండా జారిపోతుందో ఆ విధంగా. మరొక హృదయం – ఫిత్నాల కాతణంగా (వ్యామోహాలు, వాంఛలు, పరీక్షల కారణంగా) నల్లగా మారిన హృదయం, ఇది తలక్రిందులుగా బోర్లించబడిన కూజా లాంటిది, ఇందులో నీరు నిలిచి ఉండలేదు. అదేవిధంగా, ఈ హృదయం మంచితనం లేదా జ్ఞానం ద్వారా ప్రభావితం కాదు. అది మంచిని గుర్తించదు, చెడును ఖండించదు, అది ఇష్టపడే, ప్రేమించే మరియు కోరుకునే వాటిని తప్ప. హుదైఫా రదియల్లాహు అన్హు ఉమర్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: "మీ జీవితకాలంలో ఈ పరీక్షలేవీ (ఈ ఫిత్నాలు ఏవీ) జరగవు; మీకు మరియు వాటికి మధ్య ఒక మూసిన ద్వారం ఉంది; అయితే అది త్వరలోనే విరిగిపోతుంది.” ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అది విరిగి పోతుందా? ఒకవేళ అది తెరుచుకున్నా, బహుషా అది తిరిగి మూసుకు పోవచ్చును కూడా”. దానికి హుదైఫహ్ రదియల్లాహు అన్హు “లేదు, అది విరిగిపోతుంది. ఆ ద్వారం ఒక మనిషి, అతడు చంపివేయ బడతాడు, లేక చనిపోతాడు.” నేను ప్రస్తావించినది నిజమైన మరియు ధృవీకరించబడిన ఉల్లేఖన. ఇది గ్రంథ ప్రజల రచనల నుండి కాదు, లేదా ఒక వ్యక్తి యొక్క ఇజ్తిహాద్ అభిప్రాయం నుండి కాదు, కానీ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు నుండి.