హిజ్రీ పదవ సంవత్సరములో జరిగిన “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) లో అరఫా దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించినారు. ఆ సంవత్సరం జరిగిన హజ్ “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) గా పిలువబడింది; కారణం ఆ ప్రసంగములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల నుండి వీడుకోలు తీసుకున్నారు. ఆయన ప్రజలందరినీ ఈ విధంగా ఆదేశించినారు - తమ ప్రభువు (అయిన అల్లాహ్) ఆదేశాలను పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి; రాత్రింబవళ్ళలో విధిగా ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఐదు నమాజులను ఆచరించాలి; రమజాన్ మాసము ఉపవాసాలు పాటించాలి; తమ సంపదల నుండి, అర్హులైన వారికి జకాతు చెల్లించాలి; అందులో పిసినారితనం వహించకండి; అల్లాహ్ విధేయతకు వ్యతిరేకం కానంతవరకు - అల్లాహ్ తమపై పాలకులుగా నియమించిన వారికి – విధేయులై ఉండాలి. ఎవరైతే పైన పేర్కొనబడిన అంశాలను ఆచరిస్తారో, వారి ప్రతిఫలం స్వర్గములోనికి ప్రవేశము అవుతుంది.