అమీరుల్ ము’మినీన్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: “నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమైనా ఉల్లేఖిస్తున్నట్లు మీరు విన్నట్లైతే, నేను భావగర్భితముగా అలంకారిక భాషను ఉపయోగించను, లేదా సూచనల రూపములో అస్పష్టమైన ప్రకటనలు చేయను; లేదా విషయాన్ని పరోక్షంగా చెప్పను. నిశ్చయంగా నేను స్పష్టంగా మాత్రమే మాట్లాడుతాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఉల్లేఖిస్తూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అసత్యాలు పలకడం కంటే నేను ఆకాశం నుండి భూమిపై పడిపోవడం నాకు సులభమైనది మరియు తేలికైనది. అయితే, నాకు మరియు ప్రజలకు మధ్య ఉన్న విషయాల గురించి నేను మాట్లాడితే, మరి యుద్ధమంటేనే తంత్రము; నేను అలంకారిక భాష, సూచనలు లేదా ద్వంద్వ అర్థ ప్రకటనలను ఉపయోగించవచ్చు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: కాలం చివరలో, ఒక యువత వస్తుంది, వారు వయస్సులో చిన్నవారై ఉంటారు మరియు తెలివితేటలలో బలహీనంగా ఉంటారు. వారు ఖురాన్ నుండి పదాలను ఉటంకిస్తూ ఉంటారు, ఖుర్’ఆన్ ను తరచుగా పఠిస్తారు, కానీ బాణం దాని లక్ష్యం గుండా దూసుకు వెళ్ళినట్లుగా వారు ఇస్లాంను విడిచిపెట్టి దాని హద్దులను అతిక్రమిస్తారు. వారి విశ్వాసం వారి గొంతులను దాటి వెళ్ళదు. మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి, ఎందుకంటే వారిని చంపడం, పునరుత్థాన దినమున, చంపిన వానికి ప్రతిఫలంగా మారుతుంది.