ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్’లో విషయాలకు సంబంధించి ఒక సాధారణ నియమాన్ని గురించి విశదీకరించారు. షరియత్ లో విషయాలు మూడు వర్గాలుగా విభజించ బడినాయి. అవి ‘హలాల్’ విషయాలుగా (అనుమతించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి, ‘హరామ్’ విషయాలుగా (నిషేధించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి మరియు ‘హలాల్’ వర్గానికి చెందినవా లేదా ‘హరామ్’ వర్గానికి చెందినవా అనే స్పష్టత లేని ‘సందిగ్ధ విషయాలు’. ఆ విషయాలకు సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటో ప్రజలలో చాలా మందికి తెలియదు. మరి ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలను (వాటి జోలికి పోకుండా) వదిలివేస్తాడో, అతడు ‘హరామ్’ లో పడిపోకుండా తన ధర్మాన్ని స్థిరంగా, సురక్షితంగా ఉంచుకున్న వాడవుతాడు. అలాగే (తనకు ఙ్ఞానము లేని) సందిగ్ధ విషయాల జోలికి వెళ్ళినందుకు, ప్రజలు అతడిపై వేసే భాండాలనుండి తన గౌరవాన్ని కాపాడుకున్న వాడవుతాడు. మరియు ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలనుండి దూరంగా ఉండడో, అతడు తనను తాను ‘హరామ్’ లో పడిపోవడానికి లేదా ప్రజల అపవాదులకు, అగౌరవానికి గురిచేసుకున్న వాడవుతాడు. సందిగ్ధ విషయాలకు దూరంగా ఉండకుండా, (తగినంత ఙ్ఞానము లేకపోయినా) వాటి జోలికి వెళ్ళే వాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పశువుల కాపరితో పోల్చినారు. ఆ పశువుల కాపరి తన పశువులను, ఒక ఆసామి యొక్క స్వంత పొలానికి అతి దగ్గరగా మేపుతూ ఉంటాడు; ఏ క్షణమైనా తన పశువులు గట్టుదాటి ఆ పొలములోనికి దూరిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ. అదే విధంగా, ఒక విషయం ‘హలాల్’ వర్గానికి చెందినదా, లేక ‘హరామ్’ వర్గానికి చెందినదా అనే స్పష్టత లేనపుడు, ఆ విషయానికి సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటి అనే ఙ్ఞానం లేనపుడు దాని జోలికి వెళ్ళే వ్యక్తి, హరాం లో పడిపోయేటంత ప్రమాధకరమైన స్థితికి అతి దగ్గరగా వెళుతున్నాడన్నమాట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. దేహంలో ఒక మాంసపు ముద్ద (హృదయం) ఉంటుందని, ఒకవేళ అది సరిగా (ఆరోగ్యవంతంగా) ఉంటే అది మొత్తం శరీరపు ఆరోగ్యతకు బాధ్యత వహిస్తుందని; ఒకవేళ అది కల్మష పడిపోతే, కలుషితమైపోతే మొత్తం శరీరం అదేవిధంగా మారడానికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.